Thursday, January 2, 2025
Homeజాతీయంరాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11ల‌క్ష‌లు

రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11ల‌క్ష‌లు

Date:

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. రిజర్వేషన్‌ వ్యవస్థను రద్దు చేయాలంటూ రాహుల్‌ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ బుధవారం స్పందించారు. ‘ఇటీవల అమెరికా పర్యటనలో రిజర్వేషన్‌లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. రిజర్వేషన్‌లను అంతర్లీనంగా వ్యతిరేకించే ఆయన మనస్తత్వాన్ని ఇది చూపుతున్నది. రాహుల్ గాంధీ నాలుకను కోసే ఎవరికైనా నేను 11 లక్షల రివార్డ్‌ ఇస్తా’ అని మీడియాతో అన్నారు.

రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యలతో ప్రజలకు అతి పెద్ద ద్రోహం చేశారని శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ ఆరోపించారు. మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీలు వంటి వర్గాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయని అన్నారు. అయితే అంతకంటే ముందే రిజర్వేషన్‌ ప్రయోజనాలను అంతం చేయడం గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ‘రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చూపించేవారు. రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని బూటకపు కథనాన్ని ప్రచారం చేసేవారు. అయితే దేశాన్ని 400 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నది’ అని మండిపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.