Thursday, October 31, 2024
HomeUncategorizedరాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు

రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు

Date:

కేరళలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని మోడీ కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఆయన తన కుటుంబానికి కంచుకోటను రక్షించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌ వరుసగా 15 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నాయకురాలు స్మృతిఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో వయనాడ్‌ బరిలో నిలిచి విజయం సాధించారు.

ప్రస్తుతం త్రిస్సూర్‌ ప్రచారంలో ఉన్న మోడీ మాట్లాడుతూ.. ”రాహుల్ కేరళ నుంచి ఓట్లు అడుగుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన తన గళం వినిపించరు” అని దుయ్యబట్టారు. అలాగే కరువన్నూర్ కోపరేటివ్ బ్యాంక్‌ స్కామ్‌ గురించి లేవనెత్తి సీపీఎంపై విమర్శలు చేశారు. పేదల సొమ్మును దోచుకుందని దుయ్యబట్టారు. అలాగే పాలక్కాడ్‌లో మాట్లాడుతూ..”పశ్చిమ్‌బెంగాల్‌ నుంచి కేరళ వరకు వామపక్ష ప్రభుత్వాలకు ఒక లక్షణం ఉంది. లెప్ట్‌ ప్రభుత్వాలు పాలించినచోట ఏమీ మిగల్లేదు. ఏదీ సరిగా జరగలేదు” అని వ్యాఖ్యానించిన ఆయన ‘నథింగ్ లెఫ్ట్‌ అండ్‌ నథింగ్ రైట్‌’ అనే పదజాలాన్ని ప్రయోగించారు. ఈ ఎన్నికల తర్వాత పార్లమెంట్‌లో కేరళ గళం పెరుగుతుందన్నారు. భారత్‌ ప్రతిష్ఠను కాంగ్రెస్‌ బలహీనపరిస్తే.. తాము దేశాన్ని బలోపేతం చేశామని తెలిపారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా ట్రైలర్ అని, కేరళ, దేశం కోసం చేయాల్సింది ఎంతో ఉందని తెలిపారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు, ఉత్తర, దక్షిణ భారతదేశంలో బుల్లెట్‌ ట్రైన్ల కోసం సర్వే ప్రారంభమవుతుందని వెల్లడించారు.