Monday, January 13, 2025
Homeజాతీయంమూడు దేశాల్లో ముగిసిన మోడీ ప‌ర్య‌ట‌న‌

మూడు దేశాల్లో ముగిసిన మోడీ ప‌ర్య‌ట‌న‌

Date:

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగిసింది. నవంబర్‌ 16 నుంచి 21 వరకూ రెండు ఖండాల్లోని మూడు దేశాల్లో మోడీ పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐదు రోజుల విదేశీ పర్యటను ముగించుకొని మోడీ స్వదేశానికి పయనమయ్యారు. శుక్ర‌వారం ఉదయం గయానా నుంచి భారత్‌కు బయల్దేరారు. మోడీ ముందుగా నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు ఈనెల 16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటించారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

నైజీరియా పర్యటనను ముగించుకొని ప్రధాని బ్రెజిల్‌ పర్యటనకు వెళ్లారు. నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో రియోడిజనీరో నగరంలో జరిగిన జీ-20 సదస్సులో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత మోదీ గయానాకు వెళ్లారు. 56 ఏళ్ల తర్వాత (1968 తర్వాత) భారత ప్రధాని ఒకరు గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ అలీతో మోదీ చర్చలు జరిపారు. ఇతర సీనియర్‌ నాయకులతోనూ సమావేశం అయ్యారు. ఇక ఈ పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం లభించింది. గయానా, డొమెనికా దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో ప్రధానిని సత్కరించాయి.