Thursday, October 31, 2024
HomeUncategorizedమానవతా దృక్పథంతో నీరు విడుదల చేయండి

మానవతా దృక్పథంతో నీరు విడుదల చేయండి

Date:

దేశ రాజధాని ఢిల్లీకి హరియాణా రాష్ట్రం మానవతా దృక్పథంతో నీరు విడుదల చేయాలని ఢిల్లీ మంత్రి ఆతిశీ కోరారు. ఇటీవల దేశ రాజధానికి 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి విషయంలో రాజకీయాలు చేయకూడదని, దేశ రాజధానికి మిగులు జలాలను సరఫరా చేయాలని సుప్రీంకోర్టు హరియాణాకు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌ విడుదల చేసిన నీరు ఢిల్లీకి అందేలా చూడాలని సూచించింది. ఢిల్లీలో తాగునీటి కొరత ”అస్తిత్వ సమస్య”గా మారిందని కోర్టు పేర్కొంది. హిమాచల్ నీటిని విడుదల చేసిందని, అయితే ఆ నీరు హరియాణా మీదుగా ప్రవహిస్తున్నందున ఢిల్లీకి కావాల్సిన నీటి వాటాను బిజెపి పాలిత రాష్ట్రం హరియాణా విడుదల చేయడం లేదని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి అదనంగా నీరు అందించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హీట్‌వేవ్‌ కారణంగా కొద్దికాలంగా రాష్ట్రంలో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగిందని తన పిటిషన్‌లో పేర్కొంది. హరియాణా, యూపీ, హిమాచల్‌తో సహా ఇతర రాష్ట్రాల నుంచి ఒక నెల పాటు అదనంగా నీరు విడుదల చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్రం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వేళ దిల్లీలో నిర్మాణ ప్రదేశాల్లో నీటి వినియోగం, వాహనాలను కడగడం వంటి వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. నీటిని వృథా చేసినవారికి రూ.2,000 జరిమానా విధిస్తామని పేర్కొంది.