Thursday, December 26, 2024
Homeజాతీయంమ‌హ‌రాష్ట్ర‌లో రాహుల్ గాంధీ బ్యాగులు త‌నిఖీ

మ‌హ‌రాష్ట్ర‌లో రాహుల్ గాంధీ బ్యాగులు త‌నిఖీ

Date:

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి అమరావతికి వచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బ్యాగులను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో ఆయన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వగానే అధికారులు చెక్‌ చేశారు. ఆయన వెంట తెచ్చుకున్న బ్యాగులతో పాటు హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో రాహుల్‌ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మ‌హారాష్ట్రలో ఈ ‘ఎన్నికల తనిఖీలు’ తాజాగా రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ఇదే విధమైన అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ స్పష్టతనిచ్చింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్రమంత్రి అమిత్ షా తదితర ఎన్డీయే నేతల బ్యాగులనూ అధికారులు తనిఖీ చేశారు. తన హెలికాప్టర్‌ను ఈసీ బృందం పరిశీలిస్తున్న దృశ్యాలను స్వయంగా అమిత్ షా తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు.పక్షపాత రహిత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను భాజపా విశ్వసిస్తోందని రాసుకొచ్చారు. కాగా.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే.