Thursday, December 26, 2024
Homeజాతీయంమ‌రో లైసెన్స్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు

మ‌రో లైసెన్స్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు

Date:

ఎల్‌ఎంవీ లైసెన్స్‌ ఉన్నవారు రవాణా వాహనాన్ని కూడా నడపొచ్చని దానికి మరో లైసెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. వ్యాపారం చేసుకొనే వ్యక్తులు, ఆటోలు, క్యాబ్‌లు నడిపేవారు ఎల్‌ఎంవీ లైసెన్స్‌తో 7,500 కిలోల కంటే తక్కువ బరువున్న కమర్షియల్‌ వాహనాలను నడపొచ్చని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది.

2017 ముకుంద్‌ దేవాంగన్‌ వర్సెస్‌ ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ కేసులో త్రిసభ్య ధర్మాసనం 7500 కిలోల గరిష్ఠ బరువుకు మించని రవాణా వాహనాన్ని తేలికపాటి వాహనం(ఎల్‌ఎంవీ) పరిధి నుంచి మినహాయించవద్దని తీర్పునిచ్చింది. అయితే దానికి అనుమతిస్తే ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్న వ్యక్తి బస్సు, ట్రక్కు లేదా రోడ్ రోలర్‌ను కూడా నడపడానికి వీలు కల్పిస్తుందని, దీనివల్ల పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. నష్టపరిహారం చెల్లించడానికి బీమా కంపెనీలపై భారం పెరిగే అవకాశం ఉందని భావించిన ఇన్సూరెన్స్‌ కంపెనీలు త్రిసభ్య ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో 75 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై తాజాగా దర్యాప్తు చేసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునే పూర్తిగా సమర్థిస్తూ ఇన్సూరెన్స్‌ కంపెనీలు వేసిన పిటిషన్లను కొట్టేసింది.