భారతదేశం నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న అథ్లెట్లకు దేశం మొత్తం మద్దతుగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆయన నేడు 112వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎదుట భారత పతాకాన్ని రెపరెలాడించే అరుదైన అవకాశం వారికి ఉందని.. మనం వారిని కచ్చితంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పలు అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
- యూకేలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 2024లో పాల్గొని పతకాలు సాధించిన జట్టును ప్రధాని అభినందించారు. ఇటీవల గణిత ఒలింపిక్స్ కూడా జరిగాయని.. దాదాపు 100 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో మనవాళ్లు అద్భుత విజయం సాధించారని అన్నారు. ఈ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు దక్కించుకొన్న విషయం తెలిసిందే.
- అస్సాంలోని చారాడ్‌దేవ్ మోదమ్‌కు యూనెస్కో వారసత్వ క్షేత్రంగా గుర్తింపు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఈ గౌరవం దక్కించుకున్న 43వ ప్రదేశమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రదేశాన్ని సందర్శించాలన్నారు.
- ఏ దేశమైన తమ వారసత్వ సంపదను ముందుకు తీసుకెళితేనే అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చేసిన ప్రయత్నమే ప్రాజెక్టు పరి అని పేర్కొన్నారు. భారత్ మండపంలో కళాకృతుల్లో దేశ సంస్కృతి ఉట్టిపడుతోందన్నారు.
- హరియాణాలోని రోహ్‌తక్‌లో 250 మంది మహిళలు బ్లాక్ పెయింటింగ్, డయింగ్‌లో శిక్షణ పొంది జీవితాలను మార్చేసుకున్నారని ప్రధాని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఖద్దర్ విక్రయాలు 400 రెట్లు పెరిగి తొలిసారి రూ.1.5 లక్షల కోట్లను దాటాయన్నారు.