ఉత్తరప్రదేశ్‌లో కొనసాగే కావడి యాత్ర మార్గం వెంబడి ఉన్న హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్ల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. యజమానులు వారు వడ్డించే ఆహారాన్ని మాత్రమే ప్రదర్శిస్తారని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా పిటిషనర్లు తమ వాదనను వినిపించారు. ”అసలైన ఉద్దేశం కనిపించకుండా మభ్య పెడుతూ ఇచ్చిన ఆదేశాలు ఇవి. నేమ్‌ప్లేట్స్ ప్రదర్శించకుండా ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తారు. ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా.. తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మనం రెస్టారెంట్‌కు వెళ్తాం. గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశమే ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం” అని వారి తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు వెల్లడించారు. ”గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆదేశాలకు ఎలాంటి చట్టబద్ధత లేదు. పోలీస్ కమిషనర్‌కు వీటిని జారీ చేసే అధికారం ఏ చట్టమూ ఇవ్వలేదు” అని మరో న్యాయవాది వాదించారు.