పాలమూరు జిల్లా మొదటి నుంచి నిర్లక్ష్యానికి గురైందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల సూచనలను ఈ ప్రభుత్వం తప్పక పాటిస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. 11వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. ఎన్నో ఏళ్లుగా జరగని డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారు. భారాస హయాంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు” అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
నిరుద్యోగుల కోసమే పరీక్షలు వాయిదా వేయడం లేదు
గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉంది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే మళ్లీ కోర్టుకు వెళ్తారు. నోటిఫికేషన్‌లో లేకుండా 1:100 నిష్పత్తిలో ఎలా పిలుస్తారని కోర్టు మళ్లీ రద్దు చేస్తుంది. పదే పదే పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోంది. పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా ఉంది. నిరాహార దీక్షల్లో పేద విద్యార్థులు, పేద నేతలు మాత్రమే ఎందుకు కూర్చుంటున్నారు. దీక్షల్లో కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు కూర్చోవడం లేదు. వారిద్దరూ ఆర్ట్స్ కాలేజీ ముందు దీక్షకు కూర్చుంటే.. రక్షణ కల్పిస్తాం. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం ఉండదు. కేవలం నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేయడం లేదు. విద్యార్థుల చావులతో భారాస రాజకీయం చేస్తుంది” అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.