Sunday, December 22, 2024
Homeజాతీయంపట్టాలెక్కనున్న అమృత్‌ వందే భార‌త్ రైలు

పట్టాలెక్కనున్న అమృత్‌ వందే భార‌త్ రైలు

Date:

దేశంలో అమృత్‌ భారత్‌ రైలూ అందుబాటులోకి వచ్చింది. ఇక వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇప్పుడు వందే మెట్రో రైళ్ల వంతు వచ్చింది. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీసును సెప్టెంబర్‌ 16వ తేదీ సోమవారం ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌- భుజ్‌ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ప్రధాని రెండ్రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన ఈ సేవలను ప్రారంభించనున్నారు.

వందే మెట్రో అనేది పూర్తి అన్‌రిజర్వ్‌డ్‌ ఎయిర్‌ కండీషన్‌తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే (అహ్మదాబాద్‌) పీఆర్‌ఓ ప్రదీప్‌ శర్మ తెలిపారు. అహ్మదాబాద్- భుజ్‌ మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగుతుందని తెలిపారు. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని చెప్పారు. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం భుజ్‌లో 5.05 గంటలకు ప్రారంభమై అహ్మదాబాద్‌ జంక్షన్‌కు 10.50 గంటలకు చేరుకుంటుందని శర్మ తెలిపారు. ప్రయాణికులు కొన్ని నిమిషాల ముందే టికెట్‌ కొనుక్కుని రైలు ఎక్కొచ్చని పేర్కొన్నారు.