వివాదాస్పదంగా మారిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియా వద్ద స్పందించారు. నాకు ఈ అంశంపై మాట్లాడటానికి ప్రభుత్వ అనుమతి లేదు. నిబంధనలు అనుమతించవు క్షమించండి. మహారాష్ట్రలోని వాసిమ్‌లో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉంది” అని పేర్కొన్నారు. పుణెలో బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వివాదాస్పదమయ్యారు ఖేద్కర్. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్‌కు బదిలీ చేసింది. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.
వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన మరిన్ని వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలొస్తున్నాయి. వీటిని నిర్ధరించే తప్పనిసరి వైద్య పరీక్షలకు ఏకంగా ఆరుసార్లు ఆమె డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.