దేశంలో నీట్ యూజీ పరీక్ష వివాదాస్పదంగా మారింది. నీట్ పరీక్ష సందర్భంగా తగినంత సమయం ఇవ్వలేదనే కారణంతో కొందరు విద్యార్ధులకు గ్రేస్ మార్కులు కలపడం, ఆ తర్వాత వారి ర్యాంకులు అనూహ్యంగా మారిపోవడం వంటి కారణాలతో పేపర్ లీక్ అనుమానాలు తలెత్తాయి. దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా ఎన్టీఏ నిర్ణయాలు మరిన్ని అనుమానాలు కలిగించాయి. అయినా నీట్ కౌన్సెలింగ్ ఆపేందుకు సుప్రీంకోర్టు కానీ, ఎన్టీఏ కానీ అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో విద్యార్ధుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. మరోవైపు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీహార్ లో విచారణ జరుగుతోంది. అయినా నీట్ పరీక్ష రద్దు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై శనివారం కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ లీక్ పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందని, గతంలో జరిగిన 2004, 2015 పరీక్షల్లో విస్తృతమైన లీక్‌లు పరీక్షలను రద్దు చేయడానికి దారితీసిన సంఘటనలకు భిన్నంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
నీట్ పరీక్షను రద్దు చేయడం వల్ల ఇందులో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోందని, కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నీట్-యుజి పరీక్షలో 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించిన తర్వాత వివాదం చెలరేగడంతో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టు కూడా కౌన్సెలింగ్ ఆపొద్దని స్పష్టం చేయడంతో తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.