దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటికోసం తల్లడిల్లుతున్నారు. నీరు పట్టుకునే సమయంలో గొడవలు పడుతున్నారు. అలాంటిది పంపు నుంచి నీటిని పట్టుకునే విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల బాలిక పొరుగింటి మహిళను కత్తితో పొడిచి చంపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలికను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఫార్ష్ బజార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వేళ కామన్ ట్యాప్ నుంచి తాగు నీరు నింపుకునే సమయంలో 34 ఏళ్ల సోనీ, ఆమె భర్త సత్బీర్ కలిసి పొరుగింటి వారితో గొడవ పడ్డారు. వాగ్వాదం సందర్భంగా 15 ఏళ్ల బాలిక చేతిని సోనీ మెలితిప్పింది.
ఈ సంఘటన నేపథ్యంలో ఆ బాలిక, ఆమె తల్లి మరోసారి సోనీ, ఆమె భర్తతో గొడవపడ్డారు. ఈ సందర్భంగా ఆ బాలిక సోనీని కత్తితో పొడిచింది. ఆమె చేయి, కడుపుపై కత్తి గాయాలయ్యాయి. ఆందోళన చెందిన సోనీ భర్త వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. సోనీని ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొరుగింటి మహిళను కత్తితో పొడిచి చంపిన 15 ఏళ్ల బాలికను ఆదివారం అరెస్ట్ చేశారు. జువెనైల్ కేంద్రానికి ఆమెను తరలించారు.