Thursday, December 26, 2024
Homeజాతీయంనిందితుడి కేక‌లు వినిపించ‌కుండా పోలీసుల హార‌న్లు

నిందితుడి కేక‌లు వినిపించ‌కుండా పోలీసుల హార‌న్లు

Date:

ప‌శ్చిమ‌బెంగాల్‌ కోల్‌కతా అత్యాచార ఘటన ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ విషయంలో పోలీసులు కాస్త చిత్రంగా ప్రవర్తించారు. అతడి కేకలు మీడియాకు వినిపించకుండా ఏకధాటిగా హారన్లు మోగించారు. నవంబర్ 11న కోర్టుకు తీసుకువచ్చినప్పుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో తనను ఇరికించారని, తనకు వ్యతిరేకంగా కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్ వినీత్ గోయల్‌ కుట్ర పన్నారని సంజయ్ పోలీసు వ్యాన్ నుంచి గట్టిగట్టిగా కేకలు వేశాడు. తాను నిర్దోషినని కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో అతడలా అరిచాడు. మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా.. అతడి వాయిస్ మీడియాకు వినిపించకుండా పోలీసులు ఆపకుండా హారన్లు మోగించారని ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన కొందరు వెల్లడించారు.

ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీ కర్‌ ఆసుపత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. దీనిలో భాగంగా గత నెల ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ పేరును మాత్రమే చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.