తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహువా మొయిత్రాకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది. డబ్బులు, గిఫ్ట్‌లు తీసుకుని.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని నమోదైన కేసులో ఆమె లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం మరోసారి టీఎంసీ పార్టీ తరఫున టికెట్ పొందిన మహువా మొయిత్రా.. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆమెను రిపోర్టర్ ఓ ప్రశ్న అడగ్గా.. మహువా మొయిత్రా ఇచ్చిన సమాధానం విని.. ఆ రిపోర్టర్ షాక్ అయ్యాడు. ఇంత ఎనర్జీగా ఉంటారు.. అసలు మీ ఎనర్జీకి కారణం ఏంటి అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. నవ్వుతూ సెక్స్ అంటూ మహువా మొయిత్రా సమాధానం ఇచ్చారు.
మహువా మొయిత్రా ఇచ్చిన సమాధానంతో ఆ రిపోర్టర్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్నవారు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రిపోర్టర్ ప్రశ్న అడగడమే ఆలస్యం.. ఆమె తడబడకుండా ఠక్కున సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్నవారికి ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఈ ప్రశ్న, జవాబుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన మహువా మొయిత్రా.. ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.