Monday, December 30, 2024
Homeజాతీయంతృణ‌మూల్ ఎమ్మెల్యేను విచారించిన సిబిఐ

తృణ‌మూల్ ఎమ్మెల్యేను విచారించిన సిబిఐ

Date:

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతాలోని జూనియర్‌ వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నిర్మల్‌ ఘోష్‌ సీబీఐ విచారణకు హాజరయ్యారు. వైద్యురాలి అంత్యక్రియల సమయంలో ఆయన జోక్యం ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. వైద్యురాలి మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మల్‌ ఘోష్‌ జోక్యం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. దీంతో ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన విచారణకు హాజరైనట్లు సంబంధిత అధికారి తెలిపారు.

సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన వైద్యులు తమ డిమాండ్లను వినిపించారు. వీటిలో కొన్నింటిని నేరవేరుస్తామని హామీ ఇవ్వడంతో వైద్యులు తాత్కాలికంగా విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్జీకర్‌ వైద్య కళాశాలలో మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ హయాంలో ఆస్పత్రిలో ఔషధాల కొనుగోళ్లలో లోపాలను సీబీఐ గుర్తించింది. రోగులకు ఇచ్చే మందుల కొనుగోలు ఇష్టారాజ్యంగా చేశారని.. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాల కొనుగోలు జరిగినట్లు ఆరోపించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్‌ ఘోష్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అనాథ మృతదేహాలను కూడా విక్రయించేవాడని, బంగ్లాదేశ్‌కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సందీప్‌ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది. ప్రస్తుతం ఆయన సీబీఐ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. తాజాగా టీఎంసీ ఎమ్మెల్యే విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.