Thursday, October 31, 2024
HomeUncategorizedతన పంచాయితీ తీర్పు తానే చెప్పిన గేదె

తన పంచాయితీ తీర్పు తానే చెప్పిన గేదె

Date:

యూపీలోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా మహేశ్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అక్షరాంపూర్‌ గ్రామంలో నందలాల్‌ సరోజ్‌కు చెందిన బర్రె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. అది పొరుగునే ఉన్న పూరే హరికేశ్‌ గ్రామానికి చేరింది. ఆ ఊరికి చెందిన హనుమాన్‌ ఆ బర్రెను కట్టేశాడు. నందలాల్‌ ఎంత వెతికినా బర్రె ఆచూకీ దొరకలేదు. చివరికి హనుమాన్‌ వద్ద ఉన్నదని తెలిసి, అక్కడికి వెళ్లి అడగ్గా ఆ బర్రె తనదేనని వాదించాడు. దాంతో హనుమాన్‌ను నందలాల్‌ రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పంచాయితీకి పిలిపించాడు.

పంచాయితీలో కూడా ఆ బర్రె తనదేనని హనుమాన్‌, నందలాల్‌ వాదులాడుకున్నారు. ఏం చేయాలో పాలుపోకపోవటంతో పెద్దమనుషుల సూచన మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కూడా ఇద్దరిని విచారించి బర్రె అసలు యజమాని ఎవరో తేల్చలేకపోయారు. చివరికి ఆ బర్రెను రెండు ఊళ్ల మధ్య విడిచిపెడుదామని, అది ఎవరి ఇంటికే చేరితే వారిదేనని పోలీసులు ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ఇద్దరూ అంగీకరించారు. దాంతో బర్రెను రెండు ఊళ్ల మధ్య వదిలేశారు. ఆ బర్రె నేరుగా మహేశ్‌గంజ్‌ గ్రామంలోని నందలాల్‌ ఇంటికి వెళ్లింది. దాంతో పోలీసులు ఆ బర్రె నందలాల్‌దే అనే నిర్ధారణకు వచ్చారు. తప్పుడు కేసు పెట్టి తమ సమయం వృథా చేసినందుకు హనుమాన్‌ను గట్టిగా హెచ్చరించి వదిలేశారు.