Thursday, December 26, 2024
Homeజాతీయంగ‌త మూడేళ్లుగా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేదు

గ‌త మూడేళ్లుగా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేదు

Date:

ఇది రాజకీయ అంశం కాదు. హరియాణా దాఖలు చేసిన అఫిడవిట్‌ చూశాం. అందులో మా ఆదేశాలు పాటిస్తున్నట్లు లేదు. సీఏక్యూఎం ఆదేశాలను ఉల్లంఘించి పంట వ్యర్థాల దహనానికి పాల్పడుతున్నవారిపై పంజాబ్‌ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు? అని సుప్రీంకోర్టు పంజాబ్‌, హ‌రియాణా ప్ర‌భుత్వాల‌ను ప్రశ్నించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈవిషయంలో తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.

”పంట వ్యర్థాల దహనం కారణంగా ఏ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయో, ఎంత పరిమాణంలో ఉన్నాయో.. ఇలా అన్ని వివరాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంది. అలాంటప్పుడు మంటలు చెలరేగిన ప్రాంతాలను గుర్తించకలేకపోతున్నామని మీరు చెప్పడం సరికాదు. కేవలం నామమాత్రంగా జరిమానాలు విధిస్తామంటే సరిపోదు. కఠిన చర్యలు తీసుకోవాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉల్లంఘనల కట్టడిలో విఫలమైనందుకు గానూ పంజాబ్‌, హరియాణా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని గాలి నాణ్యతా మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ను ఆదేశించింది. అంతేగాక.. అక్టోబరు 23న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.