కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్) చట్టాలను తీసుకువచ్చారు. ఈ కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా అమల్లోకి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పార్లమెంట్ ఉభయ సభల్లో 146 మంది ప్రతిపక్ష ఎంపీలను బయటకు పంపించి, బలవంతంగా కొత్త నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను పాస్ చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఎన్నికల్లో నైతికంగా ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాజ్యాంగానికి విలువ ఇస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ, నిజం ఏంటంటే.. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను 146 మంది ఎంపీలను బలవంతంగా సస్సెండ్ చేసి ఆమోదించారు. భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ ‘బుల్డోజర్ న్యాయం’ ఆధిపత్యాన్ని ఇండియా కూటమి ఇకపై అనుమతించబోదు’ అని ఖర్గే పేర్కొన్నారు.