ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో అతి పెద్ద కుంభకోణం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్‌కు చెందిన జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలయానికి చెందిన 228 కేజీల బంగారాన్ని మాయం చేశారని ఆరోపించారు. కేదార్నాథ్ ఆలయంలో చోటు చేసుకున్న ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని తేల్చి చెప్పారు. దర్యాప్తు జరపాలంటూ తాను ఇదివరకు డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి స్పందనా రాలేదని పేర్కొన్నారు.
ఈ మధ్యాహ్నం ఆయన ముంబైకి వచ్చారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరేతో సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో హిందువులం అని చెప్పుకొంటోన్న వారు కేదార్‌నాథ్‌లో కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పుడు వాళ్లే.. ఢిల్లీలో కూడా కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తోన్నారని, దీని పేరుతో మరో కుంభకోణానికి తెర తీయబోతోన్నారని అవిముక్తేశ్వరానంద పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్మించాలంటూ తలపెట్టిన కేదార్నాథ్ ఆలయం ఎప్పటికీ జ్యోతిర్లింగం కాబోదని తేల్చి చెప్పారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయని, ఇందులో ఒకటి హిమాలయాల్లో వెలిసిందని శివపురాణం చెబుతోందని, అలాంటప్పుడు ఢిల్లీలో నిర్మితం అయ్యే ఆలయం జ్యోతిర్లింగ్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.