దేశ రాజధాని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆప్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రామాయణంలోని ఓ సందర్భాన్ని ప్రస్తావించారు. ”నాకు ప్రస్తుతం భరతుడికి ఎదురైన పరిస్థితే ఉంది. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు.. భరతుడు పాలించాల్సి వచ్చింది. సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు. ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్‌ది. నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఢిల్లీలో మళ్లీ ఆయన అధికారాన్ని చేపడతారని విశ్వసిస్తున్నాను. ఆయన తిరిగివచ్చేవరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుంది” అని ఆతిశీ అన్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదించగా.. ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అంగీకరించడంతో..రెండు రోజుల క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్, గోపాల్‌రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు.