బస్సు ఓవర్ లోడ్ కారణంగా ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పౌరీ జిల్లాలోని నైనిదండా నుంచి నైనితాల్‌లోని రాంనగర్‌కు వెళ్తున్న ఓ బస్సు అల్మోరా వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు మృతి చెందగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఓవర్‌లోడ్ కారణంగా బస్సు లోయలో పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ… మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఎయిర్‌లిఫ్ట్ చేయాలని సూచించారు. రాష్ర్ట ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని సహాయ ప్రాంతీయ రవాణా అధికారి (ఎన్‌ఫోర్స్‌మెంట్)ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.