Thursday, October 31, 2024
HomeUncategorizedఈడీ, సీబీఐ సీజ్ చేసిన డబ్బు పేదలకే పంచుదాం

ఈడీ, సీబీఐ సీజ్ చేసిన డబ్బు పేదలకే పంచుదాం

Date:

దేశంలోని చాలా పార్టీల నేతల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కోట్ల కొద్ది గుట్టలు గుట్టలుగా డబ్బులు స్వాధీనం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈడీని.. పావుగా వాడుకుని రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఈడీ దాఖలు చేసిన కేసుల్లో శిక్ష పడిన కేసులు చాలా తక్కువ శాతమే ఉండటం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు గురించి అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసి కేవలం దేశంలో ఉన్న ప్రతిపక్షాలకు చెందిన నేతలను మాత్రమే టార్గెట్ చేస్తోందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుండగా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే కేంద్ర దర్యాప్తు సంస్థలు సమర్థవంతంగా.. పూర్తి స్వేచ్ఛతో పని చేస్తున్నాయని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న డబ్బును ఏం చేస్తారు అనే దానిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన వ్యక్తులు, సంస్థలు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, కొందరు నేతలు, పార్టీల సహకారంతో అక్రమంగా దోచుకున్న డబ్బును సీజ్ చేస్తాయని తెలిపారు. అయితే ఇలా అక్రమంగా దోచుకున్న డబ్బును దేశంలో పేద ప్రజలకు చేర్చే ఆలోచన చేస్తున్నామని నరేంద్ర మోడీ వెల్లడించారు. దాని గురించి ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కోసం న్యాయ సలహా కోరామని.. వారు ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని మోడీ స్పష్టం చేశారు.