Wednesday, January 15, 2025
HomeUncategorizedఆసుపత్రిలో కోతితో రీల్స్ చేసిన‌ నర్సులు

ఆసుపత్రిలో కోతితో రీల్స్ చేసిన‌ నర్సులు

Date:

ప్ర‌భుత్వ ఆసుపత్రిలో విధుల నిర్వ‌ర్తించాల్సిన‌ కొంద‌రు నర్సులు కోతితో ఆడుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఆరుగురు నర్సుల్ని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఓ ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మహారాజా సుహెల్‌దేవ్‌ వైద్య కళాశాల ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో కొందరు నర్సులు విధుల్లో ఉంటూ కోతిపిల్లతో ఆడుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సీరియస్‌ అయ్యారు.

ఈ ఘటనపై ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. ఎం.ఎం.త్రిపాఠి స్పందించారు. వీరిని ఆసుపత్రి గైనకాలజీ, ప్రసూతి విభాగంలో పనిచేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. వైరలైన వీడియోలో ఉన్న ఆరుగురు నర్సుల్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సంజయ్‌ ఖత్రీ జులై 5న విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు త్రిపాఠి తెలిపారు. డ్యూటీ సమయంలో కోతితో రీల్స్‌ చేయడం, పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించేలా సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఈ వీడియోతో వైద్యకళాశాల ప్రతిష్ట దెబ్బతింటుందని ప్రిన్సిపాల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని .. నివేదిక అందేవరకు ఈ ఆరుగురిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.