Wednesday, January 15, 2025
HomeUncategorizedఅమ్మాయిలు న‌చ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ లేదా ?

అమ్మాయిలు న‌చ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ లేదా ?

Date:

మ‌హారాష్ట్ర‌లోని ఓ కాలేజీ క్యాంపస్‌లో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ ఇచ్చిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల పేర్లతో వారి మతపరమైన గుర్తింపు బయటపడట్లేదా? అని ప్రశ్నించింది. అమ్మాయిలకు తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడింది. క్యాంపస్‌లో హిజాబ్‌, బుర్కా, నిఖాబ్‌, క్యాప్‌ వంటివి ధరించకూడదంటూ ముంబయిలోని ఎన్‌జీ ఆచార్య అండ్‌ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. కళాశాల నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. నిషేధంపై స్టే విధించింది. ”అమ్మాయిలకు వారు ధరించే దుస్తులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. కాలేజీలు వారిని బలవంతం చేయకూడదు. దేశంలో అనేక మతాలు ఉన్నాయి. విద్యార్థుల పేర్లు వారి మతపరమైన గుర్తింపును బయటపెట్టట్లేదా? అలాగని ఇకనుంచి వారిని నంబర్లతో పిలుస్తారా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, తరగతి గదుల్లో ముఖం పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను అనుమతించకూడదని కోర్టు స్పష్టం చేసింది. క్యాంపస్‌లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని తెలిపింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే.. సదరు విద్యా సంస్థ కోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పించింది. అనంతరం దీనిపై కాలేజీకి నోటీసులు జారీ చేసింది. నవంబరు 18లోగా తమ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.