Thursday, October 31, 2024
HomeUncategorizedఅమెజాన్ లో ఉగాది వేపపూత అమ్మకం

అమెజాన్ లో ఉగాది వేపపూత అమ్మకం

Date:

ఇంటర్నెట్ అందరికి అందుబాటులో వచ్చాక ఎన్నో వెబ్ సైట్లు, ఆన్ లైన్ పోర్టల్స్ వచ్చేశాయి. బయటికెళ్లి కొనుగోలు చేయనవసరం లేకుండానే.. ప్రతి వస్తువు ఆన్ లైన్ లో లభిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో దొరకని వస్తువంటూ ఏదీ లేదనే చెప్పాలి. ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గరి నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్నీ అమెజాన్ లో లభిస్తాయి. అయితే ఇప్పుడు వేపపూత కూడా అమెజాన్ లో అందుబాటులో ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్ 9న అంటే రేపు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది వచ్చిందంటే తెలుగిళ్లు పచ్చని తోరణాలతో పండుగలా ఉంటాయి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగను నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. బ్రహ్మ ఈ సృష్టిని ఉగాది రోజే ప్రారంభించాడని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఉగాదినాడు ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని రుచి చూడాలి అని చెబుతుంటారు. ఈ పచ్చడిని నవగ్రహాలతో పోలుస్తూ ఉంటారు. నవగ్రహాలలోని కొన్ని గ్రహాలకు ఈ పచ్చడిలోని రుచులకు సంబంధం ఉందని చెబుతారు.

షడ్రుషుల సమ్మేళనంగా ఉండే ఈ ఉగాది పచ్చడిలో తీపి, చేదు రుచులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉగాది పచ్చడిలో చేదు రుచి రావాలంటే అందులో కచ్చితంగా వేప పువ్వు వేయాల్సిందే. అయితే ఈసారి పండుగకు వేప పువ్వు కొరత వచ్చినట్లు కనిపిస్తుంది. పల్లెటూర్లలో వేపపూతకి కొరత ఉండదు కానీ పట్టణాలు అన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్న నేపథ్యంలో వీటి కొరత సిటీల్లో గట్టిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్..తన వెబ్ సైట్ లో వేపపూతని కూడా అమ్మకానికి ఉంచింది. 100 గ్రాముల పొడి వేపపూతను రూ.77కే అమెజాన్ లో అమ్ముతున్నారు. అంటే ఒక కిలో వేపపూతని రూ.770కి కొనుగోలు చేయవచ్చు.