Wednesday, January 15, 2025
HomeUncategorizedఅంబులెన్స్ లేక త‌ల్లిదండ్రుల భుజాల‌పై పిల్ల‌ల శవాలు

అంబులెన్స్ లేక త‌ల్లిదండ్రుల భుజాల‌పై పిల్ల‌ల శవాలు

Date:

ఆనారోగ్యం బారిన ప‌డి ఇద్ద‌రు బాలురు చికిత్స పొందుతూ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మృతిచెందారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక‌పోవడంతో పిల్లల మృతదేహాలను తల్లిదండ్రులు తమ భుజాలపై గ్రామం వరకు మోశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పట్టిగావ్‌కు చెందిన దంపతుల పదేళ్ల లోపు వయస్సున్న ఇద్దరు కుమారులు తీవ్ర జ్వరం బారినపడ్డారు. సకాలంలో వైద్యం అందక చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మరణించారు.

చనిపోయిన పిల్లల మృతదేహాలను తమ గ్రామానికి తరలించేందుకు ఆ ఆసుపత్రిలో అంబులెన్స్‌ సదుపాయం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ భుజాలపై కుమారుల మృతదేహాలను మోశారు. వర్షంలో తడిసిన బురద మార్గంలో సుమారు 15 కిలోమీటర్లు నడిచి తమ గ్రామానికి చేరుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ నేత విజయ్ వాడెట్టివార్ ఈ విషాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో ఎన్సీపీకి చెందిన ధర్మారావు బాబా అత్రమ్ ఎఫ్‌డీఏ మంత్రిగాను, బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ గడ్చిరోలి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్నారని తెలిపారు. సెప్టెంబరు 1న గర్భిణీ గిరిజన మహిళ ఇంటి వద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించిందని, ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్‌ పంపడంలో విఫలమవడంతో ఆమె మరణించిందని విజయ్ వాడెట్టివార్‌ గుర్తుచేశారు. తాజాగా ఇద్దరు పిల్లలు జ్వరంతో చనిపోవడం ఈ నెలలో రెండో సంఘటన అని పేర్కొన్నారు.