15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorized800 గోవులు ఆయన నేస్తాలు

800 గోవులు ఆయన నేస్తాలు

Date:

వ్యవసాయంలో సాయం ఉంది.. నలుగురికి అన్నం పెట్టే అదృష్టం అన్నదాతకే ఉంది. కానీ నేడు రైతు కొడుకు రైతు కావాలంటే పలుమార్లు ఆలోచిస్తున్నాడు.. అందరూ అన్నం పెట్టె వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాల వైపు వెళుతున్నారు. మరి వ్యవసాయం చేసేదెవరు.. నలుగురికి తిండి పెట్టేదెవరు.. అంటే సమాధానం లేని ప్రశ్నలే..  దేశం ఎంత ఎదిగినా, మనిషి ఎన్ని రంగాల్లో దూసుకుపోతూ లక్షలు, కోట్లు సంపాదించినా అతని కడుపుకు కావాల్సింది రైతు పండించిన నాలుగు మెతుకులే.. అందుకే వ్యవసాయాన్ని కాపాడాలి, రైతును కాపాడాలి, స్వచ్ఛమైన పాలు ఇచ్చే గోవును కాపాడాలనే ఆలోచనతో ఆస్ట్రేలియాలో ఉద్యోగాన్ని వదిలి సొంత గ్రామానికి వచ్చి 800 ఆవులకు మంచి నేస్తం అయ్యారు యువరైతు ఉజ్జ్వల్.. అసలు ఉజ్జ్వల్ ఏం చేస్తున్నాడో, అతను ముందడగుతో ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం…  

ముందడుగు ప్రత్యేకం

అందరిలాగే ఉజ్జ్వల్ బాగా చదువుకున్నాడు.. అందరి యువకులలాగే అతను ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడొక చిన్న కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. 11 సంవత్సరాలు ఆస్ట్రేలియాలో పని చేసాడు. అక్కడి పౌరసత్వం కూడా పొందాడు.. మంచి ఆదాయం అయినా అయన మనుసులో ఏదో ఒక వెలితి.. ఎందుకంటే తనకు చిన్నప్పటి నుండి గోవులు, వ్యవసాయం, గ్రామ వాతావరణం అంటే చాలా ఇష్టం. గ్రామాల మీద ఆసక్తితో, గోవులను రక్షించాలనే తాపత్రయంతో ఆస్ట్రేలియాలో అన్ని వదిలేసి తన సొంత దేశం ఇండియా వచ్చేశాడు. 2016 ఉగాది రోజు మూడు గోవులతో ఫార్మ్ ప్రారంభించాడు.. అలా, అలా ఆయన ఇప్పుడు 800 గోవులకు ఒక మంచి స్నేహితుడు అయ్యాడు.  

*18 రకాల ఆవు జాతులు*

ఉజ్జ్వల్ దగ్గర ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 18జాతుల గోవు జాతులు ఉన్నాయి. అందులో గిర్ గుజరాత్, ఒంగోలు, పుంగనూర్, దేవని, డాంగి, వేచూర్, మల్నాడు గిద్ద, మోటు, సాహివాల్, సింధు, పంజాబ్, పాకిస్తాన్, చోలిస్తాని, రాజస్థాన్, పాకిస్తాన్, రాతి రాజస్థాన్, హర్యానివి, కాంక్రెజ్ రాజస్థాన్, కచ్ గుజరాత్, నగోరి యూపీ, కృష్ణావాళి మధ్యప్రదేశ్, తార్ పార్కర్ రాజస్థాన్, రెడ్ సింధీ,  హర్యానా, కపిల్ గోవు, పొడ తూర్పుతో పాటు వివిధ రకాలకు చెందిన 18 ఆవు జాతులు ఉన్నాయి. మొత్తం ఉజ్జ్వల్ గౌ ఫార్మ్ లో 800 వందల ఆవులు ఉన్నాయి.

*30 రకాల స్వీట్స్ తయారు*

ఒకప్పుడు మన భారతదేశంలో 100 జాతుల ఆవులు ఉండేది. కొన్ని కారణాలవల్ల ఇప్పుడు 30 రకాల ఆవు జాతులు మాత్రమే ఉన్నాయి. దేశంలో ప్రతి ఒక్కరు దేశీయ గోవులను కాపాడే బాధ్యత తీసుకోవాలి. ఉజ్జ్వల్ దగ్గర 800 గోవులు ఉన్నాయి, ప్రతి రోజు 1000 లీటర్ల పాలు ఇస్తాయి. పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు తన సొంత బ్రాండ్ గౌ వ్యాలీ పేరుతో నడిపిస్తున్నారు. పాల ఉత్పత్తులలో ప్రధానంగా నెయ్యి, పెరుగు కాకుండా ఆరోగ్యకరమైన 30 రకాల స్వీట్స్ చేస్తున్నామని ఉజ్జ్వల్ అంటున్నాడు..

*యువ రైతులకు సపోర్ట్ చెయ్యండి*

పీజీ చదివిన ఉజ్జ్వల్ ఆస్ట్రేలియాలో సొంత కంపెనీ, మంచి జీవితం వదులుకొని వ్యవసాయంపై ఆసక్తితో ఇండియాకు వచ్చాడు. వ్యవసాయాన్ని వదిలి అందరూ ఇతర రంగాలవైపు వెళ్తే మరి మనం ఏం తినాలి. అందుకే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు, వ్యవసాయం వైపు లేదా ఫార్మింగ్ వైపు రావాలి. వచ్చే తరంలో డాక్టర్, లాయర్, ఇంజనీర్ అందరూ ఉన్నారు. కానీ వచ్చే తరానికి రైతు అనేవాడు లేడు. తినే వాళ్లు పెరుగుతున్నారు. పండించే వాళ్లు తగ్గిపోతున్నారు. పండించే వాళ్లు తగ్గిపోయినప్పుడు మనం తినే ప్రతి ఆహార పదార్థంలో కల్తీ అనేది పెరుగుతుంది. అందరూ ఆలోచించాలి, వ్యవసాయాన్ని కాపాడాలి అంటున్నాడు ఉజ్జ్వల్.  

*నా గౌ ఫార్మ్ ఎవరైనా రావొచ్చు*

వ్యవసాయం లేదా గౌ ఫార్మ్ కొత్తగా ప్రారంభించాలనుకునే యువకులు, మహిళలు ఎవరైనా తమ గౌ ఫార్మ్ రావచ్చు. తాను ఎలా చేస్తున్నానో వివరిస్తాను. మీరు కూడా మీ గ్రామంలో, మీ ప్రాంతంలో ప్రారంభించవచ్చు అంటున్నారు యువ రైతు ఉజ్జ్వల్. మెదక్ జిల్లా తుఫ్రాన్ గుండెరెడ్డి పల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో పాటు వందలాది వివిధ జాతుల గోవులకు ఒక మంచి నేస్తం అయ్యారు. గొప్ప, గొప్ప చదువులు చదువుకొని ఎక్కడో బతకడం కంటే, మనసుకు నచ్చిన పని చేసుకుంటూ మరి కొందరికి స్ఫూర్తిగా నిలవడంలో ఉన్న ఆనందం మరెక్కడ లేదు అంటున్నారు ఉజ్జ్వల్. నిజంగా ఉజ్జ్వల్ ఒక తరానికే కాదు రాబోయే తరాలకు ఒక స్ఫూర్తి.. ఉజ్జ్వల్ చేస్తున్న పనులకు ముందడుగు నుండి హ్యాట్సాఫ్…