15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedరైతును బతికించాలని తపిస్తున్నాడు..

రైతును బతికించాలని తపిస్తున్నాడు..

Date:

రైతు లేనిదే రాజ్యం లేదు.. అసలు రైతు లేకుంటే ఈ సృష్టి మనుగడయే లేదు.. మనిషితో పాటు జంతువులు, పక్షులు బతకాలంటే వాటికి తినడానికి తిండిగింజలు కావాలి.. ఆ తిండిగింజలు మళ్లీ రైతే పండించాలి.. ఒకప్పుడు గొడ్డు, గోదాం, నాగలితో పల్లెలన్నీ ఎంతో అందంగా కనబడేవి.. వ్యవసాయం అంటే ప్రాణం ఇచ్చే రైతులు ఉండేవారు. ఒక ఇంటిలో తండ్రి వృద్దుడయ్యాక, అతని కొడుకు వారసత్వంగా వ్యవసాయాన్ని నడిపించేవాడు.. కాని రోజులు మారాయి, అన్నదాతలకు గడ్డుకాలం ఏర్పడింది. వ్యవసాయంలో కష్టాలు ఎక్కువయ్యాయి. చేసిన కష్టానికి, పెట్టిన పెట్టుబడికి, పండిన పంటకు సంబంధమే లేకుండా పోయింది. అందుకే రైతు కనుమరుగవుతున్నాడు. ఎంతో ప్రేమగా చూసుకునే నాగలిని, గొడ్డును వదిలేస్తున్నాడు.. రైతు వలస పోతున్నాడు.. బతకడానికి ఏదో ఒకటి చేస్తూ కూలీగా మారుతున్నాడు.. అందుకే రైతు కనుమరుగవ్వకుండా, రైతును, వ్యవసాయాన్ని కాపాడాలని తన వంతు ప్రయత్నం చేస్తూ అన్నదాతలకు ఆశాదీపంగా మారాడు రిటైర్ట్ అగ్రికల్చర్ అధికారి దన్నపనేని అశోక్ కుమార్..

ముందడుగు ప్రత్యేకం..

వ్యవసాయంలోనే సాయం ఉంది. తాను పండించిన పంటతో నలుగురి కడుపులు నింపేవాడు రైతు.. అలాంటి రైతుకు కష్టం వస్తే అదుకునే వారు లేరు.. నేను ఉన్నానని భరోసా ఇచ్చే వారు లేరు. అందుకే అన్నదాతలకు ఆసరాగా, వ్యవసాయానికి అండగా ఉంటూ వినూత్న పద్దతులలో పంటలు పండించాలని పలు సలహలు, సూచనలు ఇస్తున్నారు అశోక్ కుమార్.. 

*రైతు శ్రేయస్సుకు ప్రత్యేక కార్యక్రమాలు..*

1976 నుండి  వివిధ ప్రాంతాల్లో నిజాయితీగా అన్నదాతల శ్రేయస్సుకు విదులు నిర్వహిస్తున్నప్పటికి జగిత్యాల, మల్యాల మండలంలో అన్నదాతలకు అందించిన సేవలు, కార్యక్రమాలు, ఇతర ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలిచాయి. వ్యవసాయ అభివృద్ధికి ఇచ్చే సూచనలు మండలంలోని ప్రతి గ్రామంలో రైతుకు అందాలన్న ఆలోచనలతో పర్యటనలను క్రమబద్దీకరణగా ప్రతి గ్రామానికి నెలలో ఒక తేదీని నిర్ణయించి ఉ.8 గం.లకు హాజరయ్యేలా నిర్ణయించేవారు. గ్రామాల పర్యటనలు చేస్తూ ఆదర్శ యువ రైతులతో సంఘాన్ని ఏర్పరచి వారిలో క్రమశిక్షణ సేవాభావం కలిపించి వ్యవసాయ గ్రామ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేశారు.

*రైతులతో పలు సామాజిక కార్యక్రమాలు..*

ఉగాది పర్వదినాన కొద్ది మంది ఉత్తమ సేవలందించిన ఆదర్శ ఉద్యోగులకు రైతు సంక్షేమం మండలి తరపున సన్మానం. డబ్బుకు స్వార్ధానికి లొంగకుండా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వారికి ఓటేసి నాయకులను ఎన్నుకోవాలని వాడ వాడనా ఊరేగింపులు జరిపి ప్రజలను ఓటు హక్కుపై చైతన్య వంతమైన కార్యక్రమాలు. రైతు మిత్ర సంఘాలచే గ్రామంలో వాడు వాడలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఊరేగింపులతో సారా నిషేధ కార్యక్రమాలు. గ్రామంలో మహిళా సోదరీమణులచే రైతన్నలకు రాఖీ కట్టే కార్యక్రమం. రైతు జన జాగృతి ఆధ్వర్యంలో గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం, గ్రామస్థులతో మాట్లాడి ప్రతి గ్రామంలో ఒక్క వినాయకుడినే ఏర్పాటు చేయడం..

*రైతు కన్నీరు పెడితే దేశానికే అరిష్టం..*

భూమి మీద పుట్టిన ప్రతి జీవికి బతకడానికి తిండిగింజలు అందించే వ్యక్తి రైతు. అసలు రైతు లేనిదీ రాజ్యమే లేదు. టెక్నాలజీ ఎంత పెరుగుతున్న మనిషి తినాలంటే వ్యవసాయం మీదనే ఆధారపడాలి. కాని నేడు రైతు కన్నీరు పెడుతున్నాడు. రైతును పట్టించుకునే వారే కరువయ్యారు. తన జీవితం సర్వస్వం వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న అన్నదాతకు ఆసరా లేదు. ఆదుకునే యంత్రాంగం లేదు. రైతు కన్నీరు పెడితే గ్రామాలకే కాదు, దేశానికే అరిష్టం. అందుకే అన్నదాతను ఆదుకునే ప్రయత్నం చేద్దాం.. వ్యవసాయాన్ని కాపాడుకుందాం. ఆ దిశగా నా ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందని దన్నపనేని అశోక్ కుమార్ అంటున్నారు.