15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedభగవద్గీతతో ప్రేమలో పడ్డాను

భగవద్గీతతో ప్రేమలో పడ్డాను

Date:

సమస్య నాకే ఉంది అనుకుంటారు.. నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయో అని లోలోపల మదనపడుతుంటారు. నిజంగా మనకు వచ్చే సమస్యలు, మనకు వచ్చే కష్టాలకు పరిష్కారం లేదా.. మనకంటే సమస్యలు, కష్టాలు లేని వారు ఎవరూ లేరా అంటే సరియైన సమాధానం ఎవరి దగ్గరి నుంచి రాదు.. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అనేవి నిత్యం ఉండేవే.. కాని వాటిని సాధించే మార్గం వైపు మన ప్రయాణం సాగాలి.. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం భగవద్గీతలో ఉందని చెపుతోంది నిర్మల హరిప్రియ దేవిదాసీ.. ఆమెతో ముందడుగు కాసేపు ముచ్చటించింది..

ముందడుగు ప్రత్యేకం

చిన్నప్పటి నుండి నాకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ ఉండేది. అస్సలు వేదాలు అంటారు కదా అవి ఏంటో తెలుసు కావాలి అని ఉండేది. ఆ పుస్తకాల్లో ఏమి ఉంటుంది అనే తపన ఉండేది. మనిషి మరణించాక ఏమి అవుతుంది. భక్తి అంటే ఏమిటి. ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను నిరంతరం నిద్ర లేకుండా చేసేవి. 2006లో మా తమ్ముడు ద్వారా ఇస్కాన్ పరిచయం అయింది. వారి దగ్గర నుండి జపం స్వీకరించాను. అప్పటి నుండి భగవంతుడి పైన ఆధారపడటం నేర్చుకున్నాను. అక్కడే నాకు నిజమైన ఆనందం దొరికింది. ఆత్మ సాక్షాత్కారం.. మనం ఎవ్వరు, మనం ఎక్కడ నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తాము. నా లక్ష్యం ఏంటి, నాకు ఏమి కావాలి.. ఈ ప్రశ్నలకు నాకు ఇక్కడే సమాధానం దొరికింది. నన్ను నేను అర్థం చేసుకోవడానికి నేను చాలా సమయం తీసుకున్నాను. సుమారు 14 సంవత్సరాల సాధన చేశాక 2020 మార్చి 28న జయపతాక స్వామి గురు మహారాజ్ దగ్గర నుండి హారి నామ దీక్ష తీసుకోవటం జరిగింది.

*నా ప్రశ్నలకు సమాధానం భగవద్గీత*

నాలో కలిగిన ప్రశ్నలకు సమాధానం భగవద్గీతలో కనిపించింది. అన్ని రకాల పుస్తకాలు చదువుతాము. కాని ఈ పుస్తకం భగవద్గీత ఏముందో చదువుదాం అని తెరిచాను. అంతే భగవద్గీతతో ప్రేమలో పడిపోయాను. నిజంగా మానవులకు భగవంతుడు రాసిన ప్రేమ లేఖ. ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొంటే ఆ వస్తువును ఎలా ఉపయోగించాలి అని ఒక మాన్యువల్ ఇస్తారు. అందులో ఈ వస్తువు ఎలా వాడాలి అని రాసి ఉంటుంది. మనుషులను సృష్టించిన తరువాత భగవంతుడు భగవద్గీత ఇచ్చాడు. భగవద్గీత కేవలం పారాయణ గ్రంధము కాదు. అది ఆచరణ గ్రంధం. దాన్ని చదివి జీవితంలో ఆచరించాలి అన్వయించాలి. అప్పుడే ప్రతి మనిషి సమస్యలు అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.

*ఈ తరానికి భగవద్గీత అవసరం*

2006 నుండి ఇస్కాన్ తో పరిచయం ఉన్న సుమారు 2015 నుండి నేను సాధన మెరుగుపర్చుకుని పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాను. 2018 నుండి పెద్ద వాళ్లకి జూమ్, గూగుల్ మీట్ ద్వారా తరగతులు చెప్తున్నాను. ఇప్పటి యువతీ, యువకులకు భగవద్గీత చాలా అవసరం. ఎందుకంటే కష్టాలు అన్ని వాళ్లకే ఉన్నట్టు, అక్కర్లేని కోరికలతో జీవితం సర్వ నాశనం చేసుకుంటున్నారు. నీళ్ల కోసం ఎడారిలో వెతికినట్టు, ఆనందం కోసం వారు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. మన మూలాలను మరచి పోతున్నారు. భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నారు. మన పిల్లలకి మనం మన వేదాలను ఇవ్వకపోతే భవిష్యత్తులో వాళ్లకి జీవించడం కూడా కష్టం అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. జీవితంలో ఇంకా ఏమి లేదు చావే దిక్కు అనే వారికి ఒక్క సారి ఈ పుస్తకం చదివితే జీవితం అంటే ఏంటో వారికే తెలుస్తుంది.

*గీతాపై అందరికి అవగాహన*

ప్రస్తుతం అందరికి భగవద్గీత తరగతులు, కిడ్స్ క్లబ్ చేస్తున్నాము. గీతాపై అర్థమయ్యేలా ఒక్కొక్కరికి వివరిస్తున్నాము. నా జీవితంలో నిత్యము భగవంతుడి సేవ, ఆరోగ్యం మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి అనే ఆలోచనతో నేను యోగ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశాను. యోగ తరగతుల ద్వారా ఎంతోమందికి శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం చూపెట్టడం జరిగింది. విద్యార్థులకు మెమొరీ, కాన్సంట్రేషన్, డెసిషన్ పవర్ కూడా ఇంప్రూవ్ అయ్యేలా హఠ యోగ, అష్టాంగా యోగ ద్వారా అవగాహన కల్పిస్తాం. మన స్టూడెంట్స్ అందరూ ఆధ్యాత్మిక జీవితం ,  భౌతిక జీవితం ఎలా బ్యాలన్స్ చేయాలో నేర్చుకుంటారు. వారికి మన శాస్త్రాలలో ఏమి చెప్పారో, మన వేదాలలో ఏమి ఉందో పరిచయం చేస్తాము. ప్రతి ఒక్కరికి భగవద్గీత గురించి తెలియజేసేలా మా ప్రయాణం ముందుకు సాగుతుంది.