15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedబాల్యమే దేశ భవిష్యత్తు..!

బాల్యమే దేశ భవిష్యత్తు..!

Date:

అభివృద్ది అంటే ఏంటి.. డబ్బు ఉంటేనే అభివృద్ది కాదు కదా.. ఒక మనిషి అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా అవగాహన పెంచుకొని ముందుకు సాగాలి.. ఎంతోమంది సమాజానికి దూరంగా బతుకుతున్నారు.. సమాజంలో ఉన్న సగం మందికి వారి సమస్యలు ఏలా పరిష్కరించుకోవాలో అవగాహన ఉండదు.. అందుకే పేద‌ల కోసం, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల కోసం, గిరిజ‌నుల కోసం ప‌నిచేయాల‌ని, వారిలో వారికి సంబంధించిన ఆంశాలపై అవగాహన పెంచాలని  ప‌సిపిల్ల‌ల మోముల‌పై చిరునవ్వులు చిందేలా, మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం త‌మ వంతు ప్ర‌య‌త్నంతో ముందుకు న‌డుస్తోంది బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్ స‌భ్యురాలు శోభారాణి. ఆవిడ చేస్తున్న కార్యక్రమాలపై ముందడుగుతో పంచుకుంది..

ముందడుగు హైద‌రాబాద్‌..

మంచి మార్పు రావాలి.. పది మందికి మంచి చేయాల‌నే ఆలోచ‌న అందరిలో ఉంటుంది.. కాని దానిని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు.  కాని బాల‌ల హ‌క్కుల కోసం, మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల కోసం, విక‌లాంగుల అభివృద్ది కోసం త‌న వంతుగా ప్ర‌య‌త్నం చేయాల‌నే త‌ప‌న శోభారాణిలో ఉంది. అందుకే ఎవ‌రి కోసమో, ఎవ‌రి మీద‌నో ఆధార‌ప‌డ‌కుండా తానే ఎందుకు ఒక సంస్థ‌ను ఏర్పాటు చేసి, తాను ప‌డ్డ క‌ష్టాలు మ‌రొక‌రు ఎందుకు ప‌డాలి అనే ఆలోచ‌న‌తోనే స్పంద‌న సోసైటీ ఏర్పాటు చేసింది. త‌న సంస్ధ నుంచి చిన్నారుల‌కు, విక‌లాంగుల‌కు, ఎంతోమంది మ‌హిళ‌ల‌కు భ‌రోసా నిస్తూ ఎంద‌రో జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తూనే ఉంది. మ‌హిళ ఆర్థికంగా ఎదుగుతేనే ఆ కుటుంబం బాగుంటుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు వేలాది మంది మ‌హిళ‌ల‌కు వివిధ అంశాల‌పై శిక్ష‌ణ ఇవ్వ‌డంతో వారు ఆర్థికంగా నిల‌దొక్కుకొని కుటుంబానికి అండ‌గా ఉంటున్నారు. స‌మాజంప‌ట్ల ఆమె ప‌డుతున్న త‌ప‌నను, ఆమెలో సేవా గుణాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్ర బాల‌ల హ‌క్కుల క‌మిష‌న్ స‌భ్యురాలిగా నియ‌మించింది.

*బాలలు అంటే ఒక భరోసా*

బాలలు అంటే కార్మికులు కాదు, వారు దేశ భవిష్యత్తు అని చెపుతున్నారు. బాలల హక్కుల క‌మిష‌న్ స‌భ్యురాలిగా అనునిత్యం బాల‌ల హ‌క్కుల‌ కోసం ప‌రిత‌పిస్తూ ఉన్నారు. రేప‌టి స‌మాజ నిర్మాణం రాబోయే బాల‌ల‌దేన‌ని వారి చ‌దువు ప‌రంగానే కాకుండా బ‌ల‌మైన తిండి ల‌భించిన‌ప్పుడు ఒక విద్యార్థి అన్ని ర‌కాలుగా ప‌రిపూర్ణ‌త సాధిస్తాడ‌ని అంటోంది శోభారాణి. తాను క‌మిష‌న్ స‌భ్యురాలిగా బాధ్య‌తలు స్వీక‌రించిన‌ప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అదిలాబాద్‌, ములుగు, జ‌న‌గామ‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లోని అధికారులు సైతం ప‌ర్య‌టించేందుకు ఆలోచించి ఎన్నో తండాల‌ను, గిరిజ‌న గ్రామాల‌ను సంద‌ర్శించి వారి జీవ‌న స్థితిగ‌తులపై, ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కాలు కింది స్థాయికి చేరేలా కృషి చేస్తున్నారు.

*బాల్యాన్ని ప్రోత్సాహిద్దాం*

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నాయి. కాని కొన్ని గిరిజ‌న గ్రామాల్లోని అక్క‌డి ప‌రిస్థితులు చూస్తుంటే బాధ క‌లుగుతోంది. అవకాశం లేక కొన్ని ప్రాంతాల్లో, అవ‌కాశం ఉండి మ‌రికొన్ని ప్రాంతాల్లో ఎదుగుతున్న బాల్యానికి స‌రియైన విద్యం, వైద్యంతో పాటు పౌష్టికాహారం అంద‌డం లేదు. విక‌లాంగులైన పిల్ల‌ల ప‌రిస్ధితి మ‌రీ అధ్వాన్నంగానే ఉంటుంది. వారికి స‌రియైన గుర్తింపు, ప్రోత్సాహం క‌రువైపోతున్నాయి. బాల్యానికి చేయూత నివ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంది అంటున్నారు.

పదవి కాదు, సేవే శాశ్వతం

మనిషికి అధికారం, ప‌ద‌వి శాశ్వతం కాదు. నాలుగు రోజులు ఉంటుంది, పోతుంది కాని మ‌నం స‌మ‌స్య‌పై త‌ల్ల‌డిల్లుతున్న వారిప‌ట్ల ఏలా స్పందించామ‌న్న‌దే ప్ర‌ధానం. ఆప‌ద‌లో త‌ల్ల‌డిల్లుతూ, క‌ష్టాల‌లో ఉన్న‌వారి ఒక్క‌రి క‌న్నీరును తుడిచినా ఈ జ‌న్మ‌కు సార్థ‌క‌త ఉంటుంది. ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ఒక తీరుగా, ప‌ద‌విలో లేన‌ప్పుడు మ‌రో తీరుగా కాకుండా తానెప్పుడు మ‌హిళల సాధికార‌త కోసం, బాల‌ల హ‌క్కుల కోసం, విక‌లాంగుల అభివృద్ది కోసం నిరంత‌రం ప‌నిచేస్తూనే ఉంటాను. వారిలో చైత‌న్యాన్ని ర‌గిలిస్తూ త‌మ‌వంతుగా మంచి మార్పుకోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాను అని గర్వంగా చెపుతోంది అనుమాండ్ల శోభారాణి.