15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedఓటరుకు ఛాయ కూడా పొయ్యలే

ఓటరుకు ఛాయ కూడా పొయ్యలే

Date:

రాజకీయం అంతా పొల్యూషన్ ఐపోయింది. గత ఇరవై సంవత్సరాల కింద ఉన్న రాజకీయానికి, ఇప్పటి రాజకీయానికి చాలా తేడా ఉంది. అప్పుడు రాజకీయ ప్రచారానికి కాలినడకన బయలుదేరేవారు. గ్రామాలలో ఎవరో ఒకరి ఇంట్లో తింటూ ప్రచారం నిర్వహించేవారు. ప్రజలను మాయ చేయడాలు, ప్రలోభాలకు గురిచేయడాలు అంటూ ఏమి లేవు. కాని ఇప్పుడు రాజకీయం అంతా స్వార్థంతో నిండిపోయింది. ప్రజలు, నాయకులు ఇద్దరూ ఎవరి స్వార్థంతో వారు ఆలోచిస్తున్నారు. నిజాయితీ నాయకుడిగా, ప్రజల మనిషిగా పేరు గడించిన *షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు* తన రాజకీయ అనుభవాలతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి ముందడుగుతో ముచ్చటించారు. 

ముందడుగు ప్రత్యేకం

వివేకానందుడి ఆలోచనలతో, వ్యవసాయంపై మక్కువతో నిజాయితీ నాయకుడిగా ఎదిగాడు బక్కని నర్సింహులు. 1994లో షాద్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా కూడా పనిచేశాడు. విలువలతో కూడిన మంచి రాజకీయాలు రావాలని, యువతకు అవకాశాలు ఇవ్వాలని నిరంతరం తపిస్తున్నాడు. తన షాద్ నగర్ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. రాజకీయం అంటే పది రూపాయలు పెట్టి వంద రూపాయలు సంపాదించుకోవడం కాదని అదొక పవిత్రమైన సేవా రంగం అని చెపుతున్నారు.

*మనకు రాజనీతిజ్ఞులు కావాలి…*

ప్రస్తుత రాజకీయాల్లో ఎంతసేపు మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోట్లు పెట్టాలి, మళ్లీ అందుకు డబుల్ సంపాదించాలి ఇదే ఆలోచన ఇప్పుడు అందరిలో ఉంది. కానీ భావిభారత పౌరులను తయారు చేద్దాం వారిని వాళ్ల కాళ్ల మీద బతికేలా తయారు చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు. ఇది దేశానికీ, సమాజానికి చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఉన్న సమాజంలో రాజనీతజ్ఞులు లేరు అంత రాజకీయ నాయకులే ఉన్నారు. రాజకీయనాయకుడి ఆలోచన మళ్ల ఏలా గెలవాలని ఆలోచిస్తడు. రాజనీతిజ్ఞుడు ఒక విజన్ తో పనిచేస్తడు. అప్పుడే మంచి యువత, మంచి సమాజం సాధ్యమవుతోంది. 

*1500 ఛాయ కోసం మళ్లీ తెచ్చి ఇచ్చారు…*

మా స్వంత గ్రామంలో ఒక వ్యక్తికి అందరికి ఛాయ తాగించాలని 1500 పంపించాను. అతను మళ్లీ పట్టుకొచ్చి నేను పంపిన 1500నాకు ఇచ్చాడు. నేను ఎమన్నా లంచగోండి అనుకుంటున్నావా అన్నాడు. నువ్వు ఎమ్మెల్యే సీటు వచ్చిందని తెలిసి నేనే మన గ్రామ ప్రజలందరికి మూడు మేకలు కోసి పెట్టాను అన్నాడు. అప్పుడు ప్రజలు అంత నిజాయితీగా ఉండేవారు. ఎలాంటి స్వార్థం లేకుండా, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి దగ్గర రూపాయి ఆశించకుండా ఓటు వేసేవారు. కాని నేడు రాజకీయమంతా మారిపోయింది. పొలిటికల్ పొల్యూషన్ అయిపోయింది. అందరూ చెడిపోయారు. అందుకు ప్రధానకారణం అన్ని పార్టీలు, ఆ పార్టీలలో ఉన్న నాయకుల కారణం..

*శాసనాలు చేసేవారి నుంచే మార్పు రావాలి…*

ఇప్పటి రాజకీయ వ్యవస్థను చూసి అందరూ మంచి మార్పు రావాలి అంటున్నారు. కానీ అదెలా సాధ్యం. మంచి మార్పు రావాలి అంటే పైనుంచే రావాలి. చట్ట సభలలో శాసనాలు చేసే నాయకుల ఆలోచనల్లో మొదలవ్వాలి. అధికారంలో ఉన్న నాయకులు మంచి పనులు చేస్తూ, ప్రజలతో మంచిగా ఉంటే, వారి కింద పని చేసే కార్యనిర్వాకవర్గం కూడా భయంతో, నిజాయితీగా ప్రజలకోసం పనిచేస్తారు. అప్పుడు గ్రామాలు, ప్రజలు, దేశం అభివృద్ధి చెందుతుంది అని అంటున్నారు బక్కని నర్సింహులు..