Friday, October 4, 2024
Homeఅంతర్జాతీయంమహిళ తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకే

మహిళ తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకే

Date:

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రభావితం చేసే కీలకాంశాల్లో అబార్షన్‌ హక్కు ఒకటి. అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గత నెల జరిగిన డిబేట్‌లో గర్భవిచ్ఛిత్తి అంశంపై ఇరువురు వాడీవేడిగా వాదించారు. ఈ క్రమంలో ట్రంప్ సతీమణి మెలానియా నుంచి కీలక స్పందన వచ్చింది. అబార్షన్‌ హక్కులపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తుండగా.. మెలానియా మాత్రం అబార్షన్‌ హక్కును సమర్థించారు.

‘మెలానియా’ పేరుతో అక్టోబర్ 8న విడుదల కానున్న మెమోర్‌లో ఈ అంశం గురించి ఆమె తన అభిప్రాయాన్ని పొందుపరిచారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ”ఆమె శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకుగాకుండా ఇంకెవరికో ఎందుకు ఉండాలి..? అవాంఛిత గర్భానికి సంబంధించి ఒక మహిళ తీసుకునే నిర్ణయాన్ని పరిమితం చేయడం..ఆమె సొంత శరీరంపై నియంత్రణను నిరాకరించడం కిందికే వస్తుంది” అని ఆమె రాసుకొచ్చారు. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా.. దానికి కొన్ని వారాల ముందు ఈ పుస్తకం విడుదల కానుంది.

గత నెల జరిగిన డిబేట్‌లో కమల మాట్లాడుతూ.. ”మహిళల అభివృద్ధి ట్రంప్‌నకు గిట్టదు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. ”ఆమె అబద్ధం చెబుతున్నారు. గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి నేను అనుకూలం కాదు. ఆ బిల్లుపై సంతకం చేయబోను” అని చెప్పారు.