Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయం43 మంది భారతీయులు బహిష్కరణ

43 మంది భారతీయులు బహిష్కరణ

Date:

మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ”బాయ్‌కాట్ మాల్దీవులు” హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

మరోసారి మాల్దీవులు భారత వ్యతిరేక వైఖరిని కనబరిచింది. అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే పేరుతో 43 మంది భారతీయులతో సహా 12 వేర్వేరు దేశాలకు చెందిన 186 మంది విదేశీయులను బహిష్కరించింది. కాని చైనాకు చెందిన ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు. బహిష్కరణకు గురైన వారిలో బంగ్లాదేశ్ నుంచి 83 మంది ఉండగా.. భారత్ నుంచి 43 మంది, శ్రీలంక నుంచి 25 మంది, నేపాల్ నుంచి 8 మంది ఉన్నారు. వారి బహిష్కరణ తేదీ ఇంకా తెలియరాలేదు. బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న విదేశీయులు అక్రమంగా దేశంలో నిర్వహిస్తున్న వ్యాపారాలను మూసేసే ప్రయత్నాలను చేపట్టామని మాల్దీవుల హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నమోదిత యజమానికి బదులుగా విదేశీయలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది.

186 మంది విదేశీయులను బహిష్కరించినట్లు మాల్దీవుల ఇమ్మిగ్రేషన్ కంట్రోలర్ షమాన్ వహీద్ తెలిపారు. చైనా నుంచి ఒక్క వ్యక్తి కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే, ముయిజ్జూ మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. సాధారణంగా మాల్దీవులకు ఎన్నికైన ఏ అధ్యక్షుడైనే ముందుగా భారత్‌ని సందర్శిస్తుంటారు. కాని ముయిజ్జూ మాత్రం ముందుగా చైనా పర్యటనకు వెళ్లారు.