Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయం200 సార్లు కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నాడు

200 సార్లు కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నాడు

Date:

కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికించింది. వైరస్ బారిన పడకుండా వ్యాక్సిన్‌ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వేశారు. కొందరు అతి జాగ్రత్తకు పోయి చెప్పిన వాటి కంటే ఎక్కువ సార్లు టీకాలు తీసుకున్న దాఖలాలూ ఉన్నాయి. అలా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి.. ఏకంగా 200 సార్లకు పైగా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ప్రకటించాడు. దీంతో శాస్త్రవేత్తలు అతడిపై అధ్యయనం చేయగా.. ఆసక్తికర విషయాలు తెలిశాయి.

జర్మనీలో దాదాపు 6 కోట్లకు పైగా మంది కొవిడ్‌ టీకాలు తీసుకున్నారు. అయితే, వీరిలో చాలా మంది నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ సార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నవాళ్లే. ఓ వ్యక్తి అయితే తాను 217 సార్లు టీకా తీసుకున్నానని చెప్పాడు. అయితే, అధికారిక వివరాల ప్రకారం అతడు 134 సార్లు వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి తెలియగానే ఎర్లాంగెన్‌-నర్న్‌బర్గ్‌లోని ఫ్రెడ్రిక్‌ అలగ్జాండర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అతడిని సంప్రదించింది. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు తీసుకుంటే అది రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దాన్ని తెలుసుకునేందుకు ఆ వ్యక్తి శరీరంపై పలు పరీక్షలు చేసింది. ఆ అధ్యయనాన్ని లాన్సెంట్‌ జర్నల్‌లో ప్రచురించింది.

”సాధారణంగా హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి వంటి దీర్ఘకాల ఇన్ఫెక్షన్లతో బాఢపడేవారు నిరంతరం టీకాలు తీసుకుంటే అది సాధారణ మంటలను కలిగిస్తుంది. ఇలా ఎక్కువ సార్లు వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలోని టి లాంటి కణాలు అలసిపోతాయని, అవి ప్రొ-ఇన్‌ఫ్లమేటరీని తక్కువగా విడుదల చేస్తాయని గత అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి వ్యాధికారకాలను అంత సమర్థంగా ఎదుర్కోలేవనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే తాజాగా చేపట్టిన అధ్యయనంలో అలాంటి సూచనలేం కనబడలేదు” అని పరిశోధకులు వెల్లడించారు. సదరు వ్యక్తి శరీరంలో కొవిడ్‌పై పోరాడే టి-కణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు మా అధ్యయనంలో తేలింది. ఇవి అలసిపోయినట్లు కన్పించలేదు. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మాదిరిగానే ఈ వ్యక్తిలోనూ టి-కణాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. మొత్తంగా అతడి రోగ నిరోధక శక్తి బలహీనపడిందనే సంకేతాలు మాకు కన్పించలేదు. సాధారణ స్థితిలోనే ఉంది” అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.