అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ని భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా శాస్త్రవేత్తలు రెస్క్యూ మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. సెప్టెంబర్ 28 నుంచే ఈ మిషన్ ప్రారంభమైంది. జూన్ నెలలో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్యాప్సూల్‌లో వీరిద్దరు అంతరిక్షంలోని ”అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)” వద్దకు వెళ్లారు. అయితే, స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీలు, థ్రస్టర్లలో వైఫల్యం వంటి కారణాలతో దాంట్లో తిరిగి భూమి పైకి రావడం ప్రమాదమని భావించిన శాస్త్రవేత్తలు, వారు లేకుండానే స్టార్ లైనర్ భూమి మీదకు తీసుకువచ్చారు.
వీరిని స్పేస్ ఎక్స్‌కి చెందిన వ్యోమనౌక క్రూ-9 ద్వారా భూమి మీదకు తీసుకురాబోతున్నారు. క్రూ-9 మిషన్ కోసం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వ్యోమనౌక వెళ్లేందుకు సిద్ధమైంది. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే, సిబ్బంది సెప్టెంబర్ 29 సాయంత్రం 5.30 గంటలకు అంతరిక్షంలోకి వెళ్లబోతోంది. ఈ క్రూ-9లో నాసా కమాండర్ నిక్ హేగ్, రష్యా రోస్కోస్మోస్ నుంచి అలెగ్జాండర్ గుర్బునోవ్ ఉన్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా నలుగురు వ్యోమగాములు ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. జూన్ 6 నుంచి ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ ఇందులో తిరిగి రావడానికి రెండు సీట్లు ఖాళీగా ఉంటాయి. ప్రస్తుతం వీరిద్దరు ఐఎస్ఎస్‌లో పార్క్ చేయబడిన క్రూ-8లో ఉన్నారు. క్రూ-9 వచ్చిన తర్వాత వీరిద్దరు ఇందులోకి వెళ్తారు.