Saturday, December 21, 2024
Homeఅంతర్జాతీయంశత్రువుల ప్రణాళికలను భగ్నం చేస్తాం

శత్రువుల ప్రణాళికలను భగ్నం చేస్తాం

Date:

తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేస్తామని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్‌, పాలస్తీనాలలో జరుగుతోన్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఐదేళ్లలో తొలిసారిగా శుక్రవారం ఉపన్యాసంలో ప్రసంగించిన ఆయన.. ఇజ్రాయెల్‌పై ఇటీవల చేసిన క్షిపణి దాడులను సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా మరణం తమనెంతో బాధించిందన్నారు. ”హమాస్‌, హెజ్‌బొల్లాలపై ఇజ్రాయెల్‌ ఏ విధంగానూ విజయం సాధించదు. సయ్యద్‌ హసన్‌ నస్రల్లా మనమధ్య లేనప్పటికీ ఆయన సూచించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన బలిదానం వృథా కాదు. శత్రువు ప్రణాళికలను భగ్నం చేస్తాం. వారికి వ్యతిరేకంగా మనమందరం ఏకం కావాలి” అని సుప్రీం లీడర్‌ ఖమేనీ పిలుపునిచ్చారు.

హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లాను ఇజ్రాయెల్‌ ఇటీవల అంతమొందించిన విషయం తెలిసిందే. నస్రల్లా సంస్మరణగా టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఇరాన్‌ సుప్రీం ఖమేనీ.. ఇజ్రాయెల్‌పై చేసిన క్షిపణి దాడులు ప్రజాసేవలో భాగమేనని సమర్థించుకున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది మద్దతుదారులు హాజరయ్యారు. ఇదిలాఉంటే, ఇరాన్‌ క్షిపణి దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ఇప్పటికే హెచ్చరించింది. సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు ప్రధాన లక్ష్యంగా ఉన్నారు.