Thursday, December 26, 2024
Homeఅంతర్జాతీయంవారానికే రంగు వెలిసిన ఒలింపిక్ ప‌త‌కం

వారానికే రంగు వెలిసిన ఒలింపిక్ ప‌త‌కం

Date:

పారిస్‌లో జ‌రుగుతున్న ఒలింపిక్స్‌పై చాలామంది అథ్లెట్లు ఇప్ప‌టికే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఒలింపిక్‌ పతకంపై ఓ అథ్లెట్‌ పెట్టిన పోస్ట్‌ మరో వివాదానికి తెర లేపింది. పారిస్‌లో కాంస్యం సాధించిన అమెరికా స్కేటర్‌ నిజా హ్యూస్టన్‌.. వారానికే దాని రంగు పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు పతకం తాజా ఫొటోను షేర్‌ చేస్తూ నాణ్యత గురించి ప్రశ్నించాడు.

”ఈ ఒలింపిక్‌ పతకాలు కొత్తగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కన్పించాయి. కానీ దాన్ని నేను వేసుకున్నాక చెమట తగిలి కొంత రంగు మారిపోయింది. అనుకున్నంత నాణ్యతగా లేవు. కాస్త గరుకుగా మారిపోయింది. ముందువైపు రూపు మారింది. ఈ పతకాల నాణ్యతను మరింత పెంచితే బాగుంటుంది. ఈ పతకాన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లుగా అనిపిస్తోంది” అని హ్యూస్టన్‌ పేర్కొన్నాడు. రంగు మారిన పతకం ఫొటోను షేర్‌ చేశాడు. గతవారం జరిగిన స్ట్రీట్‌ స్కేట్‌బోర్డింగ్‌లో ఈ స్కేటర్‌ కాంస్య పతకం నెగ్గాడు. దీనిపై పారిస్‌ ఒలింపిక్స్‌ అధికార ప్రతినిధి స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని తెలుసుకున్నామన్నారు. దీనిపై చర్యలు చేపట్టామని, డ్యామేజ్‌ అయిన మెడల్స్‌ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.