అత్యాచారం వివాహేతర సంబంధం వల్ల గర్భం దాల్చిన మహిళ, గర్భవిచ్ఛత్తికి ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కొత్త చట్టం తీసుకువచ్చింది. అత్యాచారం లేదా అక్రమ సంబంధం విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి తీసుకురావాలని తీర్మానం పేర్కొంది. మహిళల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించేందుకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తుంది. ఇదిలా ఉంటే యూఏఈలో కనీసం ఏడాది ఉన్న మహిళలకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.
యూఏఈ చట్టాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. అయితే, మహిళలకు ఈ నేరాల వల్ల ఎదురయ్యే గర్భధారణన సమస్యను పరిష్కరించేందుకు చట్టాలు కావాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ నేరాలకు పాల్పడిన వారికి యూఏఈ చట్టం ప్రకారం యావజ్జీవ శిక్ష విధిస్తారు. ఒక వేళ అమ్మాయి 18 ఏళ్ల లోపు ఉంటే, దివ్యాంగురాలు అయితే మరణశిక్ష విధిస్తారు. ప్రస్తుతం యూఏఈ ప్రవేశపెట్టిన తీర్మానం అధికార గెజిట్‌లో ప్రకటించిన తర్వాత అమలులోకి వస్తుంది. మహిళల హక్కులను ప్రాధాన్యత ఇస్తూ, ఛాందసవాద చట్టాలను మార్చే పనిలో యూఏఈ ఉంది. కొత్త చట్టం మహిళల ఆరోగ్యం, సమానత్వానికి ప్రతీకగా నిలువబోతోంది.