రష్యాతో యుద్ధం వల్ల తమ దేశానికి చెందిన 31 వేల మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. అయితే రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎంత మంది సైనికులు గాయపడ్డారన్న విషయాన్ని వెల్లడించబోనని జెలెన్‌స్కీ చెప్పారు. ఎందుకంటే ఆ అంశం రష్యా సైన్యానికి ఊతం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ అధికారికంగా మృతుల సంఖ్యను వెల్లడించిన సందర్భాలు తక్కువే. కానీ కొందరి అంచనాల ప్రకారం ఆ సంఖ్య భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఆదివారం జెలెన్‌స్కీ మృతుల వివరాలను వెల్లడించారు. మృతుల సంఖ్యపై రష్యా తప్పుడు సమాచారం ఇస్తోందని, అందుకే మృతి చెందిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్యను ప్రకటించినట్లు జెలెన్‌స్కీ చెప్పారు. తాజా యుద్ధంలో ఇప్పటి వరకు 31000 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని, మూడు లక్షలో లేక లక్షన్నరో కాదు అని ఆయన అన్నారు. పుతిన్ బృందం చెబుతున్నది నిజం కాదు అని, కానీ తమకు జరిగిన నష్టం తీవ్రమైందే అని ఆయన అన్నారు. యుద్ధంలో సాధారణ పౌరులు చనిపోయిన సంఖ్యను ఆయన వెల్లడించలేదు. కానీ రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో వేల సంఖ్యలో పౌరులు మృతిచెందినట్లు భావిస్తున్నామని అన్నారు. హత్యకు గురైనవారు, వేధింపులకు గురైనవారు, డిపోర్టేషన్‌కు గురైనవారి సంఖ్య తెలియదన్నారు.
రష్యా దాడిలో సుమారు 70 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు గత ఆగస్టులో అమెరికా తెలిపింది. సుమారు లక్షా 20 వేల మంది గాయపడి ఉంటారని పేర్కొన్నది. అయితే ఈ యుద్ధంలో రష్యాకు చెందిన 1,80,000 మంది సైనికులు మృతిచెందారని జెలెన్‌స్కీ తెలిపారు. వేల సంఖ్యలో రష్యన్లు గాయపడినట్లు ఆయన చెప్పారు. రష్యా సైన్యంలో ఉన్న 45 వేల మంది మృతిచెంది ఉంటారని, వారికి సంబంధించిన వివరాలను ఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఓ మీడియా ద్వారా తెలుస్తోంది. రష్యా సైనికుల మృతిపై బ్రిటన్ రక్షణశాఖ కూడా ఓ ప్రకటన చేసింది. సుమారు మూడున్నర లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని బ్రిటన్ వెల్లడించింది.