కాల్పుల విరమణకు ఆదేశాలు ఇస్తాను అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రెండు షరతులు విధించారు. రష్యా విదేశాంగ శాఖ కార్యాలయంలో పుతిన్ మాట్లాడుతూ.. ”మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తాం” అని అన్నారు. కాల్పుల విరమణకు ఆదేశాలతో పాటు చర్చలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్‌కు షరతు విధించారు. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఒకవైపు జీ7 దేశాలు ఇటలీలో సమావేశమైన తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు గతంలో రష్యా ప్రకటించింది. అయితే, ఈ చర్యను ఉక్రెయిన్, పశ్చిమదేశాలు ఖండించాయి. రష్యా దళాలు ఆక్రమించి విలీనం చేసుకున్న ఆ నాలుగు ప్రాంతాలతో పాటు 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియాను కూడా వదిలివెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నాటోలో చేరే దిశగా అడుగులు వేస్తోన్న తరుణంలో… రష్యా ఇచ్చిన ఆఫర్ ఉక్రెయిన్‌కు రుచించకపోవచ్చు.