పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వరుసగా పలు కేసుల్లో ఏళ్ల కొద్దీ శిక్షలు పడుతున్నాయి. మాజీ ప్రధాని కావడంతో హై ప్రొఫైల్ హోదా కల్పించారు. కానీ ఆయన జైల్లో పనులు చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ వార్తా కథనాల్లో వెల్లడైంది.
అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్, ఆయన సన్నిహితుడు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమ్మద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష పడింది. వారిద్దరూ ప్రస్తుతం రావల్పిండిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న అడియాలా జైల్లో ఉన్నారు. వారికి హై ప్రొఫైల్ హోదా ఉండటంతో మిగతా ఖైదీల నుంచి విడిగా ఉంచుతారు. జైలు మాన్యువల్ ప్రకారం.. వారికి రెండు జతల యూనిఫాం కూడా ఇచ్చారు. అయితే మిగతా కేసుల్లో ఇమ్రాన్‌పై విచారణ జరుగుతుండటంతో.. ప్రస్తుతం ఆయన యూనిఫాం ధరించాల్సిన అవసరం లేదు. కానీ వీరిద్దరూ జైలు ప్రాంగణంలో పనిచేయాల్సి ఉంటుందని రాతపూర్వక ఆదేశాలు ఉన్నాయి. సంబంధిత వర్గాల ప్రకారం.. మిగతా వారిలా హై ప్రొఫైల్ ఖైదీలను తోట పని, వంట పని, కర్మాగారాలు, ఆసుపత్రుల్లో పని చేయించరు. వారు మెయింటినెన్స్ విభాగంలో లేక జైలు అధికారులు అప్పగించిన మిగిలిన పనులు చేస్తుంటారు. వారి హోదా ప్రకారం.. వారి ఆహారాన్ని వారే తయారుచేసుకునే వెసులుబాటు ఉంది. ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ కూడా జైలు శిక్ష ఎదుర్కొంటున్నారు. తోషఖానా కేసులో వీరిద్దరికీ 14 ఏళ్లు శిక్ష పడగా.. నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి తాజాగా మరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది.