Thursday, December 26, 2024
Homeఅంతర్జాతీయంమాజీ క్రికెటర్ కుమారుడికి రెండు స్వర్ణాలు..

మాజీ క్రికెటర్ కుమారుడికి రెండు స్వర్ణాలు..

Date:

విండీస్‌ మాజీ క్రికెటర్ విన్‌స్టన్ బెంజమిన్‌ కుమారుడు రాయ్‌ బెంజమిన్ కూడా ప్రారంభంలో క్రికెట్‌ వైపే మొగ్గు చూపించాడు. కానీ, అతడిలోని రేసర్‌ను గుర్తించిన అంటగ్వా కోచ్‌లు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ వైపు మళ్లించారు. దీంతో తండ్రి దారికి భిన్నమైన పంథాలో వెళ్లాడు. ఇప్పుడదే అతడిని స్టార్‌ను చేసింది. అథ్లెటిక్స్‌ వైపు వెళ్లిన రాయ్‌ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు స్వర్ణాలు సాధించాడు. అయితే, అతడు అమెరికా తరఫున బరిలోకి దిగడం గమనార్హం.

తన కుమారుడి విజయంపై మాజీ క్రికెటర్ విన్‌స్టన్ ఆనందం వ్యక్తంచేశారు. క్రికెట్‌తో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”నేనెప్పుడూ ఇలాంటి అనుభూతిని పొందిన వారిని కలవలేదు. ఈ ఆనందం మాటల్లోనే చెప్పలేను. జీవితంలో అద్భుత క్షణాలు ఇవే. రాయ్‌ సాధించిన అచీవ్‌మెంట్‌కు హ్యాపీగా ఉంది. అతడు ఎంత శ్రమించాడో నాకు తెలుసు. ఇలాంటి ఘనత కోసం చాలా కష్టపడ్డాడు. స్వర్ణాలు గెలిచిన క్షణాలను చూస్తుంటే వరల్డ్ కప్‌ ఫైనల్‌ గుర్తుకొచ్చింది” అని తెలిపారు.

నేను వెస్టిండీస్‌కు చెందినప్పటికీ.. రాయ్ అమెరికన్‌. అతడు అక్కడే పుట్టాడు. దీంతో అమెరికన్లతో కలిసి సంబరాలు చేసుకున్నాం. ఇలాంటి మెగా ఈవెంట్‌లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ఘనతనూ సొంతం చేసుకున్నాడు. అతడి రేస్ ప్రారంభానికి ముందు నా దృష్టంతా అక్కడే ఉంది. రాయ్‌ చాలా రిస్క్‌ తీసుకుంటున్నాడని అతడి తల్లితో అన్నా. ఒక్కసారి ట్రాక్‌లోకి అడుగుపెట్టాక పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉన్నాడనే భరోసా కలిగింది. చివరికి అనుకున్నది సాధించాడు” అని విన్‌స్టన్ ఆనందం వ్యక్తంచేశారు.