లండన్‌లోని ఒక విశ్వవిద్యాలయం భారతీయురాలి పట్ల జాతి వివక్ష చూపింది. దీంతో బాధితురాలికి పరిహారం చెల్లించాలని యూనివర్సిటీని ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ ఆదేశించింది. భారత్‌కు చెందిన కాజల్ శర్మ పోర్ట్‌మౌత్ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. అయితే, ఇది ఐదేళ్ల కాంట్రాక్టు కావడం గమనార్హం. 2020 డిసెంబరుతో ఈ ఒప్పందం ముగిసింది. తన అనుభవంతో మళ్లీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. యూనివర్సిటీ లైన్ మేనేజర్ ప్రొఫెసర్ గారీ రీస్ ఆమె పట్ల జాతి వివక్ష చూపించాడు. నియామక ప్రక్రియలో ఎలాంటి కారణం చూపకుండా కాజల్ దరఖాస్తును తిరస్కరించాడు. అంతేకాకుండా అనుభవం లేని వారిని ఆ ఉద్యోగంలో భర్తీ చేశాడు.
దీనిపై బాధితురాలు ప్రశ్నించగా అతడు స్పందించలేదు. ఆమె ఫిర్యాదుతో సౌతాంప్టన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. కాజల్ నైపుణ్యాలు, ఉద్యోగ అనుభవాన్ని గుర్తించడంలో రీస్ విఫలమయ్యాడని పేర్కొంది. అతడు ఈ నియామక ప్రక్రియ పట్ల పారదర్శకంగా లేడని.. ఆమె దరఖాస్తును తిరస్కరించడానికి గల సరైన కారణాలను చూపించలేకపోయాడని గుర్తించింది. దీంతో బాధితురాలికి 450,000 పౌండ్లు చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశించింది.