ఆఫ్రికా దేశం నైజీరియాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఈశాన్య రాష్ట్రం యోబేలో బొకోహరమ్ మిలిటెంట్లు గ్రామాలపై విరుచుకుపడ్డారు. కన్పించినవారిని కన్పించినట్లుగా కాల్చిచంపారు. ఈ కిరాతక దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. యోబేలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలో దాదాపు 50 మంది ఉగ్రవాదులు మోటార్ సైకిళ్లపై వచ్చి ఈ దాడికి తెగబడ్డారు. మార్కెట్లు, ప్రార్థనా స్థలాలు, ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపారు. భవనాలను నిప్పుబెట్టి బీభత్సం సృష్టించి అనేకమందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనలకు బొకోహరమ్ ఇస్లామిక్ సంస్థే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 102 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియరాలేదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
బొకోహరమ్ కార్యకలాపాల గురించి ఈ ప్రాంత వాసులు నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చారని, అందుకు ప్రతీకారంగానే వారు ఈ దాడులకు తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇటీవల భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టి.. అనేక మంది బొకోహరమ్ సభ్యులను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. 2009లో నైజీరియా ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగిన బొకోహరమ్ మిలిటెంట్లు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది వీరు జరిపిన దాడుల్లో ఇప్పటికి కనీసం 1500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఘర్షణల్లో మొత్తంగా 35వేల మంది ప్రాణాలు కోల్పోగా.. కనీసం 20లక్షల మంది వలస వెళ్లారు.