బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు మరింతగా పెరిగాయి. నిరసనకారులు ఏకంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దిగిపోయేలా చేయడంతో పాటు దేశం విడిచి పారిపోయేలా చేశారు. అంతటితో వారి ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, అభ్యర్థులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో కొందరు అల్లరి మూకలు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఎంపీ ముష్రఫే మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టారు.
బంగ్లా మాజీ కెప్టెన్ ముష్రఫే మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టిన విషయం తెలిశాక.. ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. తమకు మద్దతులివ్వలేదన్న కోపంతో నిరసనకారులు ఎక్కడ తమపై దాడులకు దిగుతారో అన్న భయంలో క్రికెటర్లు ఇళ్లు ఖాళీ చేసినట్లు సమాచారం.