బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఫ్యాషన్ ప్రియుల నుంచి నిరసన సెగ తగిలింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన ధరించిన దుస్తులు, బూట్లు మ్యాచ్ కాకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆయన వారికి సారీ చెప్పి, సమాధానపర్చాల్సి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలుపు- నీలం రంగు షర్ట్, ప్యాంట్‌కు కాంబినేషన్‌లో అడిడాస్ సంస్థకు చెందిన వైట్ సాంబా స్నీకర్స్‌ను సునాక్ ధరించారు. ఇది ఫ్యాషన్ ప్రేమికులను మెప్పించలేదు. వీటికొక ప్రత్యేక ట్రెండ్ ఉంటుంది. దీనిని సునాక్ దెబ్బతీశారని వారంతా భావించి, కామెంట్ల రూపంలో తమ వ్యతిరేకతను తెలియజేశారు. దాంతో ఆయన స్పందించాల్సి వచ్చింది.
”సాంబా లవర్స్‌కు క్షమాపణలు చెప్తున్నాను. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. సాంబాతో పాటు ఆ సంస్థకు చెందిన ఇతర మోడళ్లను ఎన్నోఏళ్లుగా ధరిస్తున్నాను. కొన్నేళ్ల క్రితం క్రిస్మస్ సందర్భంగా మొదటిసారి నా సోదరుడు ఆ కంపెనీ బూట్లను కొనిచ్చారు. అప్పటినుంచి ఈ ఉత్పత్తులకు అభిమానిగా మారిపోయాను” అని వివరణ ఇచ్చారు. తన ఆహార్యంపై ఇతరుల ఫోకస్ ఉండటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందంటూ నవ్వేశారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది సునాక్ ముందు ఎన్నికల గండం ఉంది. ఇప్పటికిప్పుడు అక్కడ ఎన్నికలు జరిగినా.. ఈ భారత సంతతి నేతతో పాటు ఆయన కేబినెట్‌లోని సగం మందికి పైగా మంత్రులకు ఓటమి తప్పదని ముందస్తు ఎన్నికల సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే.