Sunday, October 6, 2024
Homeఅంతర్జాతీయంప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్

Date:

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ చైనాలోని కియాన్‌జియాంగ్‌ సెంచురీ నగరంలో ఉంది. 675 అడుగుల ఎత్తైన ఈ బహుళ అంతస్తుల భవనం చైనాలోనే అద్భుత కట్టడంగా నిలుస్తోంది. 39 అంతస్తులతో ‘ఎస్‌’ ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం విస్తీర్ణం 14 లక్షల చదరపు మీటర్లు. గరిష్ఠంగా 30 వేల మంది నివసించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు.

ఇంత భారీ నివాసమైనప్పటికీ వసతులకు మాత్రం ఎటువంటి కొదవ లేదట. ఎలాంటి అవసరం వచ్చినా ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లనవసరం లేదు. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారంట్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, వినోద కార్యక్రమాలు.. ఇలా సకల సౌకర్యాలు అక్కడే ఉన్నాయి. ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఫుడ్‌ కోర్టులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, నిత్యవసర దుకాణాలు, సెలూన్లతోపాటు ఎంతో ఆహ్లాదకరమైన పార్కులు కూడా ఉండటం విశేషం. ఇప్పటికే 20 వేల మంది నివాసం ఉంటుండగా.. మరో 10 వేల మందికి సరిపడా ఏర్పాట్లు ఉన్నాయి. విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకు అద్దె ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

రీజెంట్ ఇంటర్నేషనల్‌ పేరుతో ఉన్న ఈ భవనం 2013లోనే ప్రారంభమైనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది ఒకేచోట నివసించే విధంగా చేపట్టిన ఈ అత్యాధునిక భవన నిర్మాణం అద్భుతమని, ఆర్కిటెక్టుల ప్రతిభకు నిదర్శనమంటూ పలువురు యూజర్లు స్పందిస్తున్నారు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదని కొందరు పేర్కొన్నారు. అయితే, భూకంపాల సమయంలో ఏమైనా ప్రమాదం జరిగితే రెస్క్యూ సిబ్బందికి సవాలేనని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు.