Monday, December 23, 2024
Homeఅంతర్జాతీయంప్రధానమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న

ప్రధానమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న

Date:

సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ తన బాధ్యతల నుంచి వైదొలగుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఆయన మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు. నాయకత్వ మార్పు అనేది ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైన క్షణమని పేర్కొన్నారు. ఉప ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు. వాస్తవానికి ఆయన గతంలోనే పదవిని వీడాల్సింది. అయితే కరోనా పరిస్థితులు, తదుపరి పీఎం ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది.

2024లో ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న ఉద్దేశాన్ని గతేడాది నవంబరులోనే ప్రకటించాను. ఈమేరకు మే 15న బాధ్యతల నుంచి నిష్క్రమిస్తాను. ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ తదుపరి ప్రధానిగా అదేరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. వాంగ్‌ ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ముఖ్యంగా మహమ్మారి సమయంలో చాలా కష్టపడ్డారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పాలకవర్గం కట్టుబడి ఉంది. సింగపూర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేందుకు కొత్త ప్రభుత్వాధినేతతో కలిసి పనిచేయాలి” అని దేశ ప్రజలను ఉద్దేశించి లీ తెలిపారు.

సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ పెద్ద కుమారుడే లీ సీన్‌ లూంగ్‌ (72). గణితంలో దిట్ట. దేశ మూడో ప్రధానిగా 2004 ఆగస్టులో ప్రమాణస్వీకారం చేశారు. 70 ఏళ్లు దాటిన తర్వాత పదవి నుంచి దిగిపోతానని 2012లోనే ప్రకటించారు. పాలకపక్షమైన ‘పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ’ రాజకీయ వారసత్వంలో భాగంగా ఇదివరకటి ఉప ప్రధాని హెంగ్ స్వీ కీట్.. తదుపరి పీఎం కావాల్సింది. తన వయసు (60)ను కారణంగా చూపుతూ 2021లో ఆయన వైదొలిగారు. ఏడాదిపాటు సుదీర్ఘ చర్చల అనంతరం ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్ (51)ను డిప్యూటీ పీఎం చేశారు.