Sunday, December 22, 2024
Homeఅంతర్జాతీయంపోలింగ్‌ రోజున పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్లు

పోలింగ్‌ రోజున పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్లు

Date:

పాకిస్థాన్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున మరోసారి బాంబు పేలుళ్లు, కాల్పులతో వణికిపోయింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. బాంబులు విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా.. ముష్కరులు అక్కడినుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు ఆ ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు.

అటు బలూచిస్థాన్‌లోనూ నేడు మరోసారి బాంబు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. బలూచిస్థాన్‌లో బుధవారం కూడా పేలుళ్లు చోటుచేసుకుని 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పాక్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా.. నేటి ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. అయినప్పటికీ తాజా పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా 90వేల పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్‌ పూర్తవగానే లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.